Saturday, December 26, 2009

Attack on nagam janardhan reddy!!


ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో తీవ్ర నిరసన ఎదురైంది. వారిపై విద్యార్థులు దాడికి దిగారు. ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరోనేత టి.దేవేందర్‌గౌడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

పార్లమెంట్‌లో తక్షణమే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ గురువారం ఓయూ ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌, తెదేపా ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి తదితరులు వారి ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు అక్కడకు వచ్చారు. మొదట వాహనం దిగిన రేవంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిని ఆందోళనకారులు చుట్టుముట్టారు. స్పీకర్‌కు రాజీనామా సమర్పించి వచ్చానని రేవంత్‌రెడ్డి సమాధానమివ్వడంతో వారిని వదిలేశారు. దీక్ష చేస్తున్న విద్యార్థులను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మరికొన్ని వాహనాల్లో తెదేపా నేత కడియం శ్రీహరి తదితరులు రాగా...నిరసన వెల్లువతో ఆయన వెనక్కివెళ్లారు. ఇంతలో నాగం జనార్దనరెడ్డిని కొందరు చుట్టుముట్టారు. తెలంగాణపై వైఖరేంటని ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ 'తెలంగాణ వచ్చినా..మా అధినేత చంద్రబాబేనంటూ' సమాధానమివ్వటంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. నాగంపైకి కొందరు చెప్పులు విసిరారు. తోపులాటలో ఆయన కిందపడ్డారు. ఈ సమయంలోనే కొందరు నాగంపై చేయి చేసుకున్నారు. పావుగంట పాటు అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన చొక్కా చిరిగిపోయింది. కొందరు విద్యార్థులు ఆయనను బయటకు తీసుకొచ్చి ద్విచక్ర వాహనంపై తరలించారు. కొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న అంగరక్షకులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వంద మీటర్ల దూరంలోనే ఉన్న పోలీసు బలగాలు అక్కడికి రాలేదు. దేవేందర్‌గౌడ్‌ కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆరు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

దాడి.. మా పనికాదు: జేఏసీ
దీక్ష శిబిరంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ తెదేపా ఎమ్మెల్యేలపై దాడి తమ పని కాదన్నారు. తామంతా సంయమనంతో ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్యేలపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 'ఇది లగడపాటి రౌడీలు..జగన్‌ గూండాలు చేయించిన దాడి' అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై దాడిని ఓయూ అధ్యాపక సంఘం ఖండించింది. కొంత మంది సంఘ విద్రోహ శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని సంఘం నేతలు లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, చెన్న కృష్ణారెడ్డిలు పేర్కొన్నారు.

అట్టుడికిన నగరం
బంద్‌తో హైదరాబాద్‌ అట్టుడికింది. ప్రత్యేక రాష్ట్రం అంశంపై చిదంబరం చేసిన ప్రకటనతో బుధవారం ఆరంభమైన ఆందోళన గురువారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రజాప్రతినిధులపై దాడులు... ఎంఎంటీఎస్‌ రైళ్ల ధ్వంసాలు... పోలీసులపై రాళ్లు... విద్యార్థులపై లాఠీఛార్జీ... గాలిలోకి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో ఆందోళనకారులపై రబ్బురు బుల్లెట్లను సైతం ప్రయోగించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై దాడితో ఆందోళన పరాకాష్టకు చేరుకుంది.

అసెంబ్లీ ముట్టడికి యత్నం
నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించేందుకు హాస్టళ్ల నుంచి బయల్దేరగా పోలీసులు వారిని నిలువరించే యత్నం చేశారు. దీంతో వారిపైకి విద్యార్థులు రాళ్లు విసిరారు. మాసాబ్‌ట్యాంక్‌, బషీర్‌బాగ్‌ హాస్టళ్ల వద్ద లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు విద్యార్థులకు దెబ్బలు తగిలాయి. ఉస్మానియా విద్యార్థులను అదుపు చేసేందుకు తార్నాక వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. క్యాంపస్‌ దాటి బయటకు వచ్చిన విద్యార్థులను తిరిగి పంపించేందుకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) సిబ్బంది రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఒక రబ్బరు బుల్లెట్‌ లింగం అనే విద్యార్థికి తగలడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. సహనం కోల్పోయిన పోలీసు ఒక విద్యార్థికి తుపాకీ గురిపెట్టి చంపేస్తామంటూ హెచ్చరించడంతో మరో కానిస్టేబుల్‌ వచ్చి వారించాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని మధ్యాహ్నం నుంచి ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట 12 మంది విద్యార్థులు ఆమరణ దీక్షలకు కూర్చున్నారు. రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, బి.బిక్షమయ్యగౌడ్‌, నర్సారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, జర్నలిస్ట్‌ అల్లం నారాయణ తదితరులు క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. హైకోర్టు, నాంపల్లి, రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. తెదేపా ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో గందరగోళం చోటుచేసుకుంది. నాగం తదితరులపై దాడి జరిగింది.

ధ్వంసమైన ఛానళ్ల వ్యాన్లు.. రైళ్లు..
తెలంగాణకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నారంటూ మూడు ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాల వ్యాన్లపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. వాహనాల అద్దాలు పగులగొట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. ఆర్ట్స్‌ కళాశాల, సీతాఫల్‌మండి వద్ద ఎంఎంటీఎస్‌ రైళ్లను ఉద్యమకారులు ధ్వంసం చేశారు.

రబ్బర్‌ బుల్లెట్ల వినియోగం
ఓయూలో గురువారం భద్రత దళాలు రబ్బర్‌ బుల్లెట్లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వస్తున్న గుంపును చెదరగొట్టేందుకు ముందుగా లాఠీఛార్జి చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించినా వారు వెనక్కు తగ్గకపోవడంతో భద్రత సిబ్బంది రెండు రౌండ్ల మేరకు రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు.

No comments:

Post a Comment