Saturday, December 26, 2009

ఇక మా జోలికి వస్తే మర్యాదగా ఉండదు..:బాబు


తెలుగుదేశం పార్టీ జోలికి గాని, టిడిపి నాయకుల జోలికి గానీ వస్తే సహించేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఉస్మానియాలో తమ పార్టీ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి తదితరులపై గురువారం జరిగిన దాడి కుట్ర అని, ముందస్తు పథకం జరిగిందని ఆయన నిప్పులు చెరిగారు. నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేయించింది తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, తెరాస నాయకులే అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

ప్రజల ఆస్తులను కాపాడేందుకు మీరు ఉన్నారా? లేక దాడులు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బలమైన టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేయడం ద్వారా లబ్ధి పొందాలని, తమ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

క్యాడరే లేని తెరాసే ఇతర పార్టీలపై దాడులకు తెగబడుతుంటే తెలంగాణలో అత్యంత బలీయమైన క్యాడర్ ఉన్న తాము ఒక్క పిలుపు ఇస్తే ఏమవుతారో ఊహించుకోవాలని ఆయన హెచ్చరించారు. టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఉస్మానియా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారన్న వార్త విన్న వెంటనే తెలుగుదేశం పార్టీయే ముందుగా ఖండించిందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 39 మంది టిడిపి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళితే ఇంత దారుణంగా దాడి చేస్తారా? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

నాగం జనార్దన్ రెడ్డిపై దాడిచేసి కొట్టిన శ్రీకాంత్ రాజు అలియాస్ నాగరాజే స్వయంగా తప్పు ఒప్పుకున్నాడని, కేసీఆర్, తెరాస నాయకుల ప్రోద్బలంతో దాడికి దిగినట్లు చెప్పాడని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులపై ఇలా బరితెగించి దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియాలోకి వెళ్ళేందుకు తమ పార్టీ నాయకులను పోలీసులు అనుమతించారని, విద్యార్థులు కూడా సాదరంగా లోనికి తీసుకువెళ్ళారన్నారు.

ఆ తరువాత కొందరు గ్రూపుగా వచ్చి ఘర్షణకు దిగి నాయకులపై దాడిచేశారని చెప్పారు.
ముప్పై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపై నిన్న ఉస్మానియాలో జరిగిన దాడికి సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు.

జనార్దన్ రెడ్డిని తాను పరామర్శించినప్పుడు తనకు పునర్జన్మ అనడంతో తన కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. విద్యార్థుల ఆందోళనను ఆసరాగా చేసుకొని నాగరాజు లాంటి అసాంఘిక శక్తులతో చేతులు కలిపి కేసీఆర్ చేయించిన పాశవిక దాడి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారంనాడు బంద్ సందర్భంగా టిడిపి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథిగృహాన్ని ధ్వంసం చేశారని, మహబూబ్ నగర్ లో తమ పార్టీకి చెందిన నాయకుడి ఆస్తులపై దాడి చేశారని, మోహన్ బాబు కుమారుడి షూటింగ్ యూనిట్ పైన, అల్లు అర్జున్ చిత్రం షూటింగ్ పైన దాడులు చేశారని, మహేష్ బాబు సినిమా చిత్రీకరణ కోసం కోటిన్నర రూపాయల ఖర్చుతో వేసిన సెట్టింగ్ ను తెరాస నాయకులు శ్రేణులు తగులబెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

సున్నితమైన తెలంగాణ సమస్యపై శాంతియుతంగా ఉద్యమిస్తే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేందుకే తెరాస అవతరించిందా? అని చంద్రబాబు నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని మొన్నటి జిహెచ్ఎంసి ఎన్నికల ముందు తాము హామీ ఇచ్చామన్నారు.

వారికిచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తాము చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఆందోళన ముసుగులో కక్ష తీర్చుకోవడానికి వచ్చారా? అని తెరాస నాయకులు, కేసీఆర్ ను ఆయన దుయ్యబట్టారు. తమ పార్టీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని చంద్రబాబు నిలదీశారు.

No comments:

Post a Comment