దేనికైనా ఢీ అంటే ఢీ అనేవాడుంటేనే పస తెలుస్తుంది.
మంగళవారంనాడు తన కుమారుని షూటింగ్‌పై దాడిచేసిన తెరాస కార్యకర్తలపై- కేసీఆర్‌పైనా వాగ్భాణాలు సంధించిన మోహన్ బాబుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిన్నరాత్రి తెలంగాణా నాయకులు కూడా మోహన్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం విశేషం. మధుయాష్కితోపాటు పలువురు నాయకులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఇప్పటివరకూ చిరంజీవి తర్వాత సమైక్యాంధ్ర అంటూ ముందుకు వచ్చిన మోహన్ బాబుపై ఇండస్ట్రీ ఒక్కసారిగా కొమ్ముకాస్తోంది. రియల్ లైఫ్‌లో కూడా డేరింగ్‌గా ఉండే మోహన్ బాబు వ్యక్తిత్వం నిన్న జరిగిన పరిణామాల నేపధ్యంలో కేసీఆర్‌కు సరైన మొగుడువి నువ్వేనని మెచ్చుకుంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు తెలంగాణా నిర్మాతలు దర్శకులు కూడా కేసీఆర్ నోటి దురుసు వల్ల తమకు అవమానం జరిగినట్లు భావిస్తున్నారు.
ఇప్పటివరకూ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవి అనే రెండు వర్గాలున్నాయనేది తెలిసిందే. కానీ మారిన రాష్ట్ర పరిస్థితుల రీత్యా అంతా ఒక్కటయ్యే పరిణామం సంభవించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు చిరంజీవి ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. లక్ష్మీప్రసన్నకు జరిగిన అవమానం తన కుమార్తెకు జరిగిన అవమానంగా భావిస్తున్నాని చిరంజీవి మోహన్ బాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మీ ప్రసన్న కాస్త ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది.
అసలు ఈ దాడికి కారణమేమిటి?
మోహన్ బాబు సమైక్యాంధ్ర అంటూ నినాదం ఇవ్వడమే తెరాస కార్యకర్తల దాడికి అసలు కారణం. మోహన్ బాబు కుమారుడు విష్ణు నటించిన సలీమ్ చిత్రాన్ని తెలంగాణాలో నిలిపివేశారు. తెలంగాణా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మోహన్ బాబు విద్యాసంస్థలు హైదరాబాదులో ఉండటంతో వాటిపైనా దాడి జరిగింది. దీంతో సమైక్యాంధ్ర నినాదంతో మోహన్ బాబు రంగంలోకి దిగారు. తిరుపతిలో ఒక్కరోజు దీక్షలో కూర్చున్నారు. సలీమ్ చిత్రాన్ని ఆంధ్రా సరిహద్దుల్లో ఆపేయమనండి చూస్తానని సవాల్ విసిరారు. అదేకాకుండా హైదరాబాదులోనే షూటింగ్ చేస్తా. దమ్ముంటే ఆపండని మరో సవాల్ విసిరారు. దానికి పర్యవసానమే మంగళవారం తెరాస జరిపిన దాడి.
నాలుక కోస్తామంటే సభ్యతా...?
నాలుక కోస్తా అని ఒక నాయకుడు, మేధావి అంటే దాన్ని సభ్యత అంటారా...? నేను ఎక్కడా వినలేదు. ఆయనపై కేసు వేయడానికైనా సిద్ధమేనని మోహన్ బాబు కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బుధవారంనాడు ముఖ్యమంత్రిని కలిసి తన శాంతియాత్రకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. దానికి రెండు రోజుల సమయం తనకు ఇవ్వమని రోశయ్య బదులిచ్చారు.
మళ్లీ అక్కడే షూటింగ్ చేస్తా...!
ఇప్పటికే కొంపల్లిలోని భవంతిలో షూటింగ్ కోసం కొంత డబ్బును చెల్లించాం. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేయాలని వచ్చారు. అదంతా వేస్ట్ అయింది. ఇల్లు చాలా ధ్వంసమైంది. అదంతా సెట్ అయితే ఈరోజే మళ్లీ అక్కడ షూటింగ్ చేస్తానని మోహన్ బాబు అన్నారు.
అమెరికా ఇచ్చిన గౌరవం తెలుగువారు ఇవ్వరా...: లక్ష్మీప్రసన్న
నేను పదేళ్లు అమెరికాలో ఉన్నాను. అక్కడ ప్రభుత్వం ఎంతో గౌరవించింది. నా చదువుకు సహకరిస్తానని కూడా హామీ ఇచ్చింది. అలాంటిది తెలుగు అమ్మాయినైన నాకు తెలుగు రాష్ట్రంలో లభించే గౌరవం ఇదేనా...? అని లక్ష్మీ ప్రసన్న సూటిగా ప్రశ్నించింది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి తెరాస వారు అడ్డంగా నరికేస్తాననే నినాదాలతో లోపలికి వచ్చారు.
పోలీసులు ముగ్గురు వచ్చారు. వారితోపాటే ఓ ఫోటోగ్రాఫర్ డిజిటల్ కెమేరాతో తీస్తుంటే వారించాం. దాంతో ఆయన నా చేయి పట్టుకుని లాగాడు. అతను జర్నలిస్టో కాదో కూడా నాకు తెలీదు. అది చూశాక మనోజ్ అతడిని ఎదుర్కొన్నాడు. అంతేకానీ, జర్నలిస్టులపై ఎదురు తిరగలేదు.
సీమ గొడ్డుకారం తిన్నవాడ్ని.. మాతో పెట్టుకోకు!!: మోహన్ బాబు:మంగళవారంనాడు జూబ్లిహిల్స్‌లోని ఓ ప్రైవేటు భవంతిలో మోహన్ బాబు కుమార్తె నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌కు తెరాస కార్యకర్తలని చెప్పుకునేవారు తీవ్ర అంతరాయం కలగజేశారు. దీంతో కెమేరాలు పగిలిపోయాయి. లక్ష్మీప్రసన్న చేతులు పట్టుకుని నానా రభస చేశారు. ఇదంతా పోలీసు అధికారి మహేష్ గౌడ్ దగ్గరుండి చేయించారని లక్ష్మీప్రసన్న ఆరోపించింది. దీంతో కలత చెందిన మోహన్ బాబు తెరాస అధినేత చంద్రశేఖరరావుపై తీవ్రంగా స్పందించారు.
చెన్నారెడ్డిగారు సినిమారంగం హైదరాబాదుకు తరలిరావాలంటే మదరాసు నుంచి ఇక్కడికి వచ్చాం. నువ్వు రమ్మంటే రాలేదే...? అసలు హైదరాబాద్ నీ అబ్బ సొత్తా...? నువ్వు ఎక్కడి వాడివి? నీ తాతలు విజయనగరంలోనివారు. అంటే... నీ మూలాలు ఎక్కడివో ఒక్కసారి గుర్తు చేసుకో. నాది తెలంగాణా అని చెప్పే అర్హత నీకు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా కావాలనే హక్కు ఉంటుంది.
నీకు తెలంగాణా కావాలంటే నువ్వు పోరాడు. నువ్వెందుకు అని మేం అడగలేదే...? మరి సమైక్యాంధ్ర కావాలని పోరాడుతుంటే మమ్మల్నెందుకు అడ్డుకుంటావ్? అసలు ఎన్నికల్లో నీ బలమెంత? అక్కడే నీ అసమర్థత తెలిసిపోయింది. ఏదో పదవికోసమో, స్వార్థం కోసమో ఇలాంటి గొడవలు సృష్టించవద్దు. మీరు గొడవ చేస్తే మేమూ గొడవ చేయగలము. చేతులకు గాజులు తొడుక్కుని లేము. మీకు ఉన్న బలంకంటే మాకు పదింతలుంది. తలచుకుంటే హైదరాబాద్ స్మశానం అవుతుంది. రాయలసీమ గొడ్డుకారం తిన్నవాడ్ని. మాతో పెట్టుకోకు... అంటూ సవాల్ విసిరారు.
హైదరాబాద్ నవాబుల సొత్తు
అసలు హైదరాబాద్ ఎవరిది..? నవాబుల సొత్తు. ఆనాడు నవాబుల పాలనలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది. అప్పటినుంచి ఇది అందరిది. మీదా...? కాదే..? ఎందుకంత తాపత్రయం. ఇక్కడ 32 శాతం ముస్లింలు ఉన్నారు. వాళ్లదే ఇది. వాళ్లకే ఇచ్చేద్దాం. నీకెందుకు ఇవ్వాలి...?
తమిళనాడే బెటర్
తమిళనాడులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఎవడు... ఎక్కడివాడు... అనే భేదం లేదు. ఎంజీఆర్ మలయాళీ, కరుణానిధి రాజమండ్రి, రజనీకాంత్ కర్నాటక... ఇలా ఎంతోమంది అక్కడ ఉన్నారు. అక్కడ మేము హాయిగా బతికాం. అక్కడ ఇలాంటి గొడవలు లేవు. హాయిగా ఉన్నవారిని ప్రభుత్వమే రమ్మని ఆహ్వానించింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావ్...?
నీ అంత చదువుకోలేదు
చంద్రశేఖర్ గారూ నేను నీ అంత చదువుకోలేదు. పుట్టినప్పుడే నీ అంత ఉన్నత కుటుంబంలో నేను పుట్టలేదు. ఏదో మధ్యతరగతివాడిని. గాలివానలాంటి చదువు చదివాం. నీకున్న తెలివితేటలు మాకు లేవు. నువ్వు పార్టీ పెట్టావ్. మేము నువ్వు ఎందుకు పార్టీ పెట్టావ్ అని అడగలేదే...? అని ఎత్తి పొడిచారు మోహన్ బాబు.
No comments:
Post a Comment